Predator Drones | అగ్రరాజ్యం అమెరికాతో భారీ డీల్ కుదుర్చుకున్నది. 31 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఇరుదేశాలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ ఒప్పందం విషయంలో ఇరుదేశాల మధ్య చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ రూ.32వేలకోట్ల విలువ ఉంటుందని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ డ్రోన్ల సహాయంతో భారతదేశ నిఘా సామర్థ్యం మరింత పెరగనున్నది. ఈ ఒప్పందానికి రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ గతవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. భారత్‌లో జరిగిన కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు, సైనికాధికారుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. హిందూ మహాసముద్రంలో భారత్ నిఘా సామర్థ్యం భారీగా పెరగనుంది.
గత ఏడాది ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 31 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలుపై భారత్ రక్షణ ఒప్పందాన్ని ప్రకటించింది. ఒప్పందంపై యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. రెండుదేశాల మధ్య వ్యూహాత్మక సాంకేతిక సహకారం, సైనిక సహకారాన్ని గణనీయంగా పెంచుతుందని చెప్పారు. ప్రిడేటర్ డ్రోన్స్ ఎంక్యూ-9బీ కొనుగోలుతో హిందుమహాసముద్రంలో భారత నైకాదళం నిఘా సామర్థ్యం భారీగా పెరుగుతుందని రక్షణరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రిడేటర్ డ్రోన్లను అమెరికన్ కంపెనీ జనరల్ అటామీక్స్ నుంచి కొనుగోలు చేయనున్నారు. భారత్, అమెరికా మధ్య విదేశీ సైనిక ఒప్పందం ప్రకారం ఈ డీల్ జరిగింది. డీల్‌లో భాగంగా 31 ప్రిడేటర్ డ్రోన్లను అమెరికా భారత్‌కు అందించనున్నది.
డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులను దేశంలోనే చేసేందుకు ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 15 డ్రోన్స్ నేవికి, మరో ఎనిమిది వైమానిక దళం, మరో ఎనిమిది ఆర్మీకి కేటాయించనున్నారు. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే భారత్ సైతం తన నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ వస్తున్నది. ఈ ప్రిడేటర్ డ్రోన్స్ ప్రత్యేక ఏంటంటే.. దాదాపు 40వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దాదాపు 40 గంటలు ఎగురుతాయి. రకరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఎగిరే సత్తా వీటి సొంతం. ప్రిడేటర్ డ్రోన్లను మానవతా సహాయం, విపత్తుల సమయంలో శోధన, రెస్క్యూ ఆపరేషన్, యాంటీ-సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, ఎయిర్‌బోర్న్ మైన్ కౌంటర్మెజర్లు ఉపయోగించవచ్చు.
దాడులు సైతం చేయొచ్చు. 2022 జూలైలో ఈ డ్రోన్ సహాయంతో యూఎస్ హెల్ఫైర్ క్షిపణిని ప్రయోగించి అల్‌ఖైదా ఉగ్రవాది ఐమన్ అల్ జవహరిని హతమార్చింది. ఈ డ్రోన్ హెల్ఫైర్ క్షిపణితో పాటు 450 కిలోల పేలుడ్తో ఎగురుతుంది. ప్రిడేటర్ డ్రోన్లను తయారు చేసే జనరల్ అటామిక్స్, ఈ డ్రోన్ భాగాలను తయారు చేయడానికి భారత కంపెనీ భారత్ ఫోర్జ్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డ్రోన్ల మరమ్మతులు, నిర్వహణ కోసం కంపెనీ భారతదేశంలోనే ఎంఆర్వో హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తుంది. దాంతో పాటు కంపెనీ తన సొంత స్వదేశీ యుద్ధ డ్రోన్లను తయారు చేయడానికి భారత్‌కు సహకారం అందించనున్నది.