న్యూఢిల్లీ: భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే అముద్రిత పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీని ఉటంకిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం సోమవారం లోక్‌సభలో తీవ్ర రభసకు దారితీసింది. భారత సరిహద్దు డోక్లాం సమీపానికి చైనా యుద్ధ ట్యాంకులు ప్రవేశించినట్లు రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. చైనా మనతో ఘర్షణకు దిగినపుడు 56 అంగుళాల ఛాతి ఏమైంది? అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలతో అధికార పక్షం నుంచి తీవ్ర నిరసనలు వెలువడ్డాయి.
రాహుల్ ప్రసంగాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తర్వాత హోంమంత్రి అమిత్ షా అడ్డుకున్నారు. పార్లమెంటరీ నిబంధనలను ఉటంకిస్తూ స్పీకర్ ఓం బిర్లా సైతం రాహుల్‌ను నిలువరించారు. తనను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని రాహుల్ అభ్యంతరం తెలిపారు. నిజాలు బయటకు వస్తాయేమోనని వారు (ప్రభుత్వం) భయపడుతున్నారు మోదీ, రాజ్‌నాథ్ గురించి వాస్తవాలు ప్రజలకు వెల్లడిస్తాం.
చైనా మనతో ఘర్షణకు దిగడానికి ముందుకు చొచ్చుకువస్తుంటే 56 అంగుళాల ఛాతికి ఏమైంది? అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని, లోక్‌సభలో చర్చకు ఆయనే నాయకత్వం వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు. దాదాపు 46 నిమిషాలపాటు రాహుల్ నరవణే పుస్తకంపై మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ అడ్డుకుంటూ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత రాహుల్ మళ్లీ ప్రసంగించేందుకు ఉపక్రమించగా సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్ సభను మంగళ వారానికి వాయిదా వేశారు.