తిరువనంతపురం: బీజేపీ.. భారీ అంచనాలతో బరిలోకి దింపిన మెట్రోమ్యాన్, 88 ఏండ్ల టెక్నాలజీ నిపుణుడు ఈ శ్రీధరన్ ఓడిపోయారు. కేరళ పాలక్కాడ్ నియోజకవర్గంలో ఉత్కంఠపోరులో మూడు వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే షఫి పరంబిల్ విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా 17 రౌండ్లకుగాను చాలా రౌండ్లలో శ్రీధరన్ ఆధిక్యం కనబరిచారు. చివరి రౌండ్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. శ్రీధరన్ బీజేపీలో చేరిన సమయంలో.. ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరిగింది. ఆయన కూడా తాను సీఎం పదవిని చేపట్టటానికి సిద్ధమేనన్నారు. తన గెలుపుపై తొలి నుంచీ ధీమా వ్యక్తంచేశారు. ప్రచారం సందర్భంగా స్థానికంగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు. పాలక్కడ్‌లో అద్దె ఇంటికి మారారు. మరోవైపు, బీజేపీ 2016 ఎన్నికల్లో ఒక్క సీటు (నిమమ్ నియోజకవర్గం) మాత్రమే గెలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ సీటును సైతం ఎల్డీఎఫ్ సొంతం చేసుకున్నది. దీంతో కేరళలో కమలం పార్టీ ఖాతా తెరువలేదు.