Satyendra Jain | బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి సత్యేందర్ జైన్ క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు పంపింది. ఈ కేసు విచారణ ఈ నెల 20న జరుగనున్నది. బన్సూరి స్వరాజ్‌పై సత్యేంద్ర జైన్ పరువు నష్టం దావా వేశారు. గతేడాది అక్టోబర్ 5న ఓ టీవీ ఇంటర్వ్యూలో తనపై ఆమె అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో ఆరోపించారు. ఆమె చేసిన చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దిగజార్చాయన్నారు. తనను అప్రతిష్టపాలు చేయడానికి, తద్వారా రాజకీయంగా మైలేజీని పొందేందుకు ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. తన నివాసం నుంచి రూ.3కోట్లు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణెలు స్వాధీనం చేసుకున్నట్లుగా తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ ఆరోపణలు నిరాధామని.. రాజకీయంగా తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. తనను అవినీతిపరుడు, మోసగాడు అంటూ మరింత పరువు తీశారని ఆయన పేర్కొన్నారు.