సిమ్లా, ఆగస్టు 16 : హిమాచల్ ప్రదేశ్లో జూన్ 20 నుంచి జరుగుతున్న వర్ష బీభత్సం ఇప్పటివరకు 257 మందిని బలి గొన్నట్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ శనివారం తెలిపింది. భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలలో మండి(26 మరణాలు), కంగ్ర(28), కులూ(11) ఉన్నాయి. వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు, గల్లంతు, విద్యుదాఘాతం వంటి ఘటనల్లో 133 మంది మరణించగా మరో 124 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారు. వర్షాల వల్ల భారీ ఆస్తి నష్టం జరిగిందని నివేదిక తెలిపింది. కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదల కారణంగా 16 మరణాలు చోటుచేసుకోగా పొంగి ప్రవహిస్తున్న నదులు, చెరువులలో 27 మంది కొట్టుకుపోయారని సంస్థ వివరించింది. పిడుగుపాటు, అగ్నిప్రమాదాలు, పాము కాట్లు, విద్యుదాఘాతం, ప్రమాదవశాత్తు పడిపోయిన ఘటనల్లో చాలామంది మరణించినట్లు నివేదిక పేర్కొంది.
మహారాష్ట్రలో గడచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఐదుగురు మరణించగా మరికొందరు గాయపడ్డారు. ముంబైలోని వఖ్రోలీ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ వర్షానికి కొండ చరియ విరిగి ఓ ఇంటిపై పడగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. జనకళ్యాణ్ సొసైటీలోని ఇంటిపై కొండచరియ విరిగిపడిన సమయంలో కుటుంబ సభ్యులు నలుగురూ ఇంట్లోనే ఉన్నారు. నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి.