హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు వివాదాస్పదమయ్యాయి. దాంతో ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ గత శుక్రవారం ప్రకటించారు. అదేవిధంగా దేశంలోని రైతులందరికీ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, ప్రధాని క్షమాపణలపై నటుడు ప్రకాష్‌రాజ్ ట్విట్టర్లో స్పందించారు. ప్రియమైన ప్రధాని గారూ సారీ చెబితే సరిపోదు అని పేర్కొన్నారు. మీరు బాధ్యత తీసుకుని రైతుల కుటుంబాలను ఆదుకోండి అని ప్రధానికి సూచించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ప్రకాష్‌రాజ్.. ప్రధాని గురించి పై కామెంట్ చేశారు. కాగా, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేగాక కేంద్రం కూడా రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, రైతులపై పెట్టిన కేసులను భేషరతుగా వాపస్ తీసుకోవాలని సీఎం డిమాండ్ చేసినట్లు మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు.
Dear Prime Minister , SORRY is not enough .. Will you own up the responsibility.. and reach out #justasking https://t.co/BtgC1gZ89x
— Prakash Raj (@prakashraaj) November 21, 2021