Darien Gap | న్యూఢిల్లీ : దొడ్డిదారిన అమెరికాలోకి ప్రవేశించాలనుకొనే వారు అనేక దేశాలు, ప్రమాదకర అడ్డంకులు, భయానక డారియన్ గ్యాప్ అడవిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. కొలంబియా, పనామా దేశాల మధ్య 97 కిలోమీటర్ల అటవీ మార్గాన్ని డారియన్ గ్యాప్ అంటారు. డారియన్ గ్యాప్ అంతటా దట్టమైన వర్షారణ్యాలు, చిత్తడినేలలు, కొండలే ఉంటాయి. అలాస్కా నుంచి అర్జెంటీనా వరకున్న పాన్ అమెరికన్ హైవేలో ఇదొక్కటే ప్రధాన ఆటంకం. దట్టమైన అడవి, కఠినమైన వాతావరణ పరిస్థితులు, ఎటువంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఈ మార్గాన్ని ఎవరూ ఉపయోగించరు. కానీ ఎట్లాగైనా అమెరికాలో కాలుమోపాలనుకునే వారికి ఇదొక్కటే దొడ్డిదారి. ఈ అడవి అంతటిలో ఎత్తయిన కొండలు, బురద నేలలే కాకుండా వేగంగా ప్రవహించే నదులు, క్రూర మృగాలను దాటుకుంటూ వెళ్లాలని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. ఈ అడవిలో విష సర్పాలు, చిరుతపులులు, ప్రాణాంతక కీటకాలు ఉంటాయి. ఇక స్మగ్లర్లు, డ్రగ్ మాఫియా ఈ మార్గంలో వెళ్లే వలసదారులను దోచుకొంటుందని, లైంగికంగా వేధిస్తుందని పేర్కొంది.
అమెరికాకు అక్రమంగా వెళ్లాలనుకునే భారతీయులు ఎక్కువగా డంకీ రూట్ ఉపయోగిస్తారట. ముందుగా వీరు వీసాలు సులభంగా లభించే దక్షిణ అమెరికన్ దేశాలకు వెళతారు. అక్కడి నుంచి మెక్సికోకు ప్రయాణమై అపై కయోట్స్ (మనుషులను స్మగ్లింగ్ చేసే ముఠాల) సాయంతో అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నిస్తారు.