DAP | దేశీయ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశం 9.74 లక్షల టన్నుల డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP)ని దిగుమతి చేసుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరానికి డీఏపీ దిగుమతికి గణాంకాలను రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో వెల్లడించారు. భారతదేశం ఏప్రిల్‌లో 2.89 లక్షల టన్నులు, మేలో 2.36 లక్షల టన్నులు, జూన్‌లో 4.49 లక్షల టన్నులు దిగుమతి చేసుకుందని చెప్పారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 45.69 లక్షల టన్నులు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 55.67 లక్షల టన్నులు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 65.83 లక్షల టన్నులు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 54.62 లక్షల టన్నులు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 48.82 లక్షల టన్నులు దిగుమతి చేసుకుందని వివరించారు. యూరియాను 2024-25లో 56.47 లక్షల టన్నులు, 2023-24లో 70.42 లక్షల టన్నులు, 2022-23లో 75.80 లక్షల టన్నులు, 2021-22లో 91.36 లక్షల టన్నులు, 2020-2లో 98.28 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నట్లు వివరించింది.
ఖరీఫ్ నేపథ్యంలో రైతుల అవసరాలను తీర్చేందుకు అవసరమైన ఎరువులు ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రసాయన ఎరువుల అవసరం గతేడాది కంటే ఎక్కువగా ఉందన్నారు. రుతుపవనాలతో పాటు సాగు విస్తీర్ణం పెరిగింది. ఏప్రిల్ 2010 నుంచి కేంద్రం ఫాస్ఫేటిక్, పొటాసిక్ (P&K) ఎరువుల కోసం పోషక ఆధారిత సబ్సిడీ (NBS) విధానాన్ని అమలు చేసింది. ఎరువుల డిమాండ్, ఉత్పత్తి మధ్య అంతరాన్ని దిగుమతుల ద్వారా తీరుస్తామని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. భౌగోళిక రాజకీయ కారణంగా సరఫరాలో గొలుసులో ఎదురైన అంతరాయాల ప్రభావాన్ని తగ్గించేందుకు.. ఎరువుల కంపెనీలు నిరంతరాయంగా సరఫరాను చేసేలా డీఏపీ ఉత్పత్తి చేసే దేశాలతో దీర్ఘకాలిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.