ఇంఫాల్, నవంబర్ 19: గత ఏడాదిన్నరగా మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, సంక్షోభం కొనసాగుతున్న క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఒక పక్క సొంత పార్టీ, కూటమి నేతలు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, కేంద్రం కూడా ఆయన పనితీరుపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో సోమవారం బీరేన్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి 25 మందికి పైగా సభ్యులు గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.
జిరిబామ్ జిల్లా ఉదంతంతో సీఎం బీరేన్ సింగ్ వైఫల్యాన్ని నిరసిస్తూ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) తాము కూటమి నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం ప్రకటించింది. దీంతో కూటమి సంక్షోభంలో పడింది. బీరేన్ సింగ్‌ను అధికారంలోంచి తొలగిస్తే తమ పార్టీ మద్దతుపై పునరాలోచిస్తామని ఎన్పీపీ చీఫ్, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా ప్రకటించారు. దీంతో ఆ పార్టీ ఏడుగురు సభ్యులు వైదొలగడంతో కూటమి బలం తగ్గింది. దీంతో అప్రమత్తమైన బీరేన్ సింగ్ సోమవారం రాత్రి హఠాత్తుగా తమ కూటమి సభ్యులను సమావేశపరిచారు. అయితే 11 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాలేదు.
మణిపూర్‌లో తీవ్ర విధ్వంసానికి కారణమైన కుకీ మిలిటెంట్లపై భారీ ఆపరేషన్ నిర్వహించాలని అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి సమావేశమైన 27 మంది ఎమ్మెల్యేలు మహిళలు, చిన్నారుల మృతికి కారణమైన కుకీ మిలిటెంట్లపై భారీ ఆపరేషన్ నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కాగా, మణిపూర్‌లోని చురాచాంద్‌పూర్ జిల్లాలో ఖాళీ శవపేటికలతో కుకీలకు మద్దతుగా వందలాది మంది ప్రదర్శన నిర్వహించారు. మణిపూర్ సంక్షోభంపై జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం విజ్ఞపి చేశారు.