Dalit Woman | లక్నో, నవంబర్ 2: బీజేపీపాలిత ఉత్తరప్రదేశ్‌లో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. గురువారం బాందాలో దారుణం చోటుచేసుకున్నది. దళిత మహిళపై కొంతమంది లైంగికదాడికి తెగబడటమేగాక, అనంతరం ఆమెను ముక్కలుగా నరికి పాశవికంగా హత్య చేశారు. గిర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.
‘ఫ్లోర్ మిల్ శుభ్రం చేయడానికి రాజ్‌కుమార్ శుక్లా ఇంటికి వెళ్లిన దళిత మహిళ (40) తిరిగి రాకపోయే సరికి, ఆమె కూతురు అక్కడి వెళ్లింది. ఇంట్లో ఓ గదిలో నుంచి ఆమె అరుపులు విని లోపలికి వెళ్లి చూసింది. కొంతసేపటి తర్వాత గది తలుపులు తెరిచిచూసే సరికి.. మూడు ముక్కలైన తన తల్లి శరీరాన్ని చూసి హతాశురాలైంది’ అని స్టేషన్ పోలీస్ అధికారి సందీప్ తివారీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాజ్‌కుమార్, అతడి సోదరులు బావు శుక్లా, రామకృష్ణ శుక్లాలను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని, నిందితులు ముగ్గురు పారిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విపక్ష ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ (ఎక్స్)లో స్పందిస్తూ, ‘బాందాలో జరిగిన ఈ ఘటన మనసు తీవ్రంగా కలిచివేసింది. ఉత్తరప్రదేశ్ మహిళలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’ అని అన్నారు.