భోపాల్, ఆగస్టు 29: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఓ దళిత మహిళ, ఆమె కుమారుడ్ని(15) పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన అక్కడి సిబ్బంది, వాళ్లద్దర్నీ చితకబాదారు. కుమారుడి కండ్లెదుట దళిత మహిళను జట్టు పట్టుకొని కిందపడేసి కొట్టారు. ఈ ఘటన దాదాపు 10 నెలల క్రితం జరిగినట్టు తెలిసింది.
ఇంతకాలం ఈ విషయం అందరికీ తెలియకుండా కప్పిపెట్టేందుకు సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని బీజేసీ సర్కార్ ప్రయత్నించిందని ఆరోపణలు వెలువడుతున్నాయి. కాట్ని జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో, ప్రభుత్వం డీఐజీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించింది.
సదరు పోలీస్ స్టేషన్ సిబ్బంది తీరు ఒళ్లు జలదరించేలా ఉందని, శాంతి భద్రతల పేరుతో గూండాయిజం ప్రదర్శిస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పది నెలల దాకా.. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నెటిజన్లు విమర్శించారు.