Gujarat | మోర్బీ, నవంబర్ 24: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చేసిన పనికి జీతం ఇమ్మని అడిగినందుకు ఒక దళిత ఉద్యోగిపై యజమానురాలు, మరికొందరు అమానుషంగా వ్యవహరించారు. బాధితుడిని ఇష్టారీతిన చితకబాదారు. అంతటితో ఆగకుండా యజమానురాలు అతడి నోట్లో బలవంతంగా తన చెప్పులు పెట్టి, క్షమాపణలు చెప్పించారు. బుధవారం మోర్బీలో జరిగిన ఈ ఘటనపై గురువారం ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు నీలేశ్ దల్సనియా.. విభూతి పటేల్ అనే మహిళ నిర్వహిస్తున్న రనీబా ఇండస్ట్రీస్‌లో నెలకు రూ.12 వేల వేతనానికి అక్టోబర్ నెల ప్రారంభంలో మార్కెటింగ్ ఉద్యోగంలో చేరాడు.
హఠాత్తుగా అదే నెల 18న అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. తనకు రావాల్సిన 16 రోజుల జీతం చెల్లించాలని నీలేశ్ అడిగినప్పుడు ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. బుధవారం నీలేశ్ తన సోదరుడు, పొరుగింటి వ్యక్తితో కలిసి విభూతి పటేల్ ఆఫీసుకు వెళ్లగానే ఆమె సోదరుడు ఓమ్ పటేల్, ఆమె కార్యాలయం మేనేజర్, మరో నలుగురు అక్కడకు చేరుకొని ఆ ముగ్గురిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బెల్ట్‌తో కొట్టి కాళ్లతో తన్ని పిడిగుద్దులు కురిపించారు. తర్వాత విభూతి పటేల్ నీలేశ్‌ను చెంప దెబ్బ కొట్టి టెర్రస్‌పైకి ఈడ్చుకెళ్లింది. నోట్లో తన చెప్పులు పెట్టి, క్షమాపణ అడగాలని నిందితురాలు విభూతి పటేల్ తనను ఒత్తిడి చేశారని బాధితుడు వాపోయారు. ఇంకోసారి తన ఫ్యాక్టరీ పరిసరాల్లో కనిపిస్తే చంపేస్తానని ఆమె తనను బెదిరించిందని తెలిపారు.
బలవంతంగా డబ్బు లాక్కోవడానికి తానే వారి ఆఫీసుకి వెళ్లినట్టు తనతో చెప్పించి వీడియో తీశారని ఆవేదన వ్యక్తంచేశారు. జీతం అడిగినందుకు క్షమాపణ చెప్పాలని నిందితులు బాధితుడిని బలవంతం చేయడం వీడియోలో కనిపించింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం మోర్బి సివిల్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉందని, నిందితులు ఎవరినీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని గాలించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ ప్రతిపాల్ సిన్హ్ వెల్లడించారు.