పాట్నా: జీతం అడిగినందుకు దళిత వ్యక్తిపై యజమాని, అతడి కుమారుడు, మరో వ్యక్తి కలిసి దాడి చేశారు. నేలపైకి తోసి కొట్టారు. (Dalit Man Thrashed) కులం పేరుతో అతడ్ని దూషించారు. అలాగే ముఖంపై ఉమ్మి వేయడంతోపాటు తనపై మూత్ర విసర్జన చేశారని ఆ వ్యక్తి ఆరోపించాడు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌపర్ మదన్ గ్రామానికి చెందిన రమేష్ పటేల్ కోళ్ల ఫారంలో దళితుడైన రింకూ మాంఝీ కొన్ని రోజులు పని చేశాడు.
కాగా, అక్టోబర్ 4న సాయంత్రం 6.30 గంటలకు రోడ్డుపై కనిపించిన యజమానిని తన జీతం డబ్బులు ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆగ్రహించిన రమేష్ పటేల్, అతడి కొడుకు, మరో వ్యక్తితో కలిసి రింకూ మాంఝీని రోడ్డు పక్కకు తోసి కొట్టారు. కులం పేరుతో దూషించారు. అనంతరం యజమాని కొడుకు తన ముఖంపై ఉమ్మి వేశాడని, తనపై మూత్ర విసర్జన చేశాడని రింకూ ఆరోపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనను చంపుతామని వారు బెదిరించినట్లు చెప్పాడు.
మరోవైపు దాడిలో గాయపడిన రింకూ మాంఝీ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దళితుడైన అతడిపై దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.