(స్పెషల్ టాస్క్ బ్యూరో ) హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రామాలయ నిర్మాణాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారంటూ దళితులు నిరసన తెలపడంతో ఓ బీజేపీ ఎంపీ కంగుతిన్నారు. స్థానిక ఆలయ శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు. అయోధ్యలో రామమందిర బాల రాముడి విగ్రహానికి ఉపయోగించిన రాతిని కర్ణాటకలోని మైసూరు వద్దనున్న గుజ్జెగౌడనపుర గ్రామం నుంచి తీసుకువెళ్లారు. దాంతో విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనే గ్రామంలో కూడా రామాలయానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు జరిగాయి.
అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా హాజరు కావాల్సి ఉండగా, అక్కడి దళితులు అతన్ని కార్యక్రమానికి హాజరుకాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన కార్యక్రమానికి హాజరు కాకుండానే వెనుదిరిగారు. ఎంపీ ప్రతాప్ సింహా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గత పదేండ్లేలో ఏనాడూ గ్రామానికి రాలేదని, ఇప్పుడు రామాలయ నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని గ్రామానికి వచ్చారని దళిత నాయకుడు సురేశ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలను రెచ్చగొట్ట్టి తనను అడ్డుకున్నారని ప్రతాప్ సింహా ఆరోపించారు.