‘దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతి ఒకరినీ కలచివేసే విషయం. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏ ఊరుకు వెళ్లినా సామాజికంగా, ఆర్థికంగా పీడితవర్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులే. ఇక నుంచి దళితుల బాధలు పోవాలె. ‘మేము కూడా పురోగమించగలం’ అనే ఆత్మసె్థైర్యంతో దళిత సమాజం ముందుకుపోవాలె. సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటిపిల్లను పెంచి పోషించడం వంటి పాత్ర. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రేపటి తరాలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకు పాలకులే బాధ్యులవుతారు. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలిగించేందుకు దశలవారీగా కార్యాచరణ అమలుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.
– కే చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి, 28-6-2021
నమస్తే తెలంగాణ, సెంట్రల్‌డెస్క్: సబ్ కా సాథ్, సబ్ కా వికాస్.. ప్రధానిగా నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో కనపడ్డ ప్రతి మైకులో పలికిన పలుకులివి. చివరకు ఇదొక నినాదమైంది. అందరితో కలిసి.. అందరి అభివృద్ధి కోసం అన్నది ఈ మాటల సారాంశం. రెండోసారి అధికారంలోకి వచ్చేసరికి.. ఈ రెండింటికి మరో రెండు తోడయ్యాయి. అవి సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్.. అందరి నమ్మకం.. అందరి కృషి.. మోదీ ఈ భారత దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి రాసుకున్న 4 సూత్రాల నినాదం ఇది. చూడ్డానికి అయనకు.. ఆయన పరివారానికి అద్భుతంగా ఉంటుంది. కానీ.. ఇందులో మొదటి మూడింటిని మోదీ ఏ కోశానా పాటించిన పాపాన పోలేదు. ఎవరితోనూ ఆయన కలిసిపోలేదు. ఎవరి అభివృద్ధినీ కాంక్షించలేదు. ఎవరి విశ్వాసమూ చూరగొనలేదు. సబ్కా ప్రయాస్ కాస్తా.. సబ్ కా కష్ట్గా మారిపోయింది. అందరినీ కష్టపెట్టడమే లక్ష్యం. ఎనిమిదేండ్లలో ఈ దేశంలో పాలన సాగిన తీరే ఇది. అన్నింటికీ మించి సామాజికంగా, ఆర్థికంగా పీడి త వర్గాలమీద మోదీ పాలిత రాష్ర్టాల్లో అరాచకాలు విచ్చలవిడిగా ప్రబలిపోయా యి. దేశానికి కళంకంగా మారిన సామాజిక వివక్ష మోదీ హయాంలో దేశమంతా పెచ్చరిల్లడం దారుణం. మోదీ ప్రాతిని ధ్యం వహిస్తున్న గుజరాత్లో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఇందుకు తాజా ఉదాహరణ.. సోమవారం బోటాద్ జిల్లా లో ఒక దళిత మహిళకు దేవాలయ ప్రవే శం నిషేధించి వెళ్లగొట్టడమే.
ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్‌లో ఎక్కడ బీజేపీ పరిపాలన ఉన్నదో.. అక్కడ దళితులపై నేరాలు పెట్రేగిపోయాయి. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాకే యూపీలో హథ్రాస్, ఉన్నావ్ ఘటనలు చోటుచేసుకొన్నాయి. బీజేపీ దన్నుతో ఇతర రాష్ర్టాల్లోనూ దళితులపై ఆ పార్టీ శ్రేణులు విశృంఖలంగా విరుచుకుపడుతున్నాయి. దళితులపై నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు లక్ష కేసులు నమోదు అవుతున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2013తో పోలిస్తే మోదీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది దళితులపై కేసులు 17 శాతం పెరిగాయి. ఒక్క యూపీలోనే ఏడాదికి వెయ్యి చొప్పున దళితులపై కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క 2018లోనే ఏకంగా 1.3 లక్షల కేసులు నమోదయ్యాయి. వీటిలో యూపీ, బీహార్, రాజస్థాన్‌లలోనే అత్యధికం ఉండటం గమనార్హం. 2018 నుంచి 2021 మధ్యకాలంలో దళితులపై నేరాలు పెరిగాయని పార్లమెంట్ సాక్షిగా మోదీ సర్కారే లెక్కలతో సహా అంగీకరించింది. దక్షిణ భారత రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ కేసులు అనేక రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.