Hindenburg Report : అదానీ విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలున్నాయని షార్ట్ సెల్లింగ్ సంస్ధ, మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్ తాజా నివేదిక దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. కార్పొరేట్ కంపెనీల ముందు ప్రస్తుత ప్రభుత్వం ఎలా సాగిలపడుతున్నదనే వివరాలను హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతం చేయడంతో రాజకీయ నేతలు ఈ నివేదికపై భుజాలు తడుముకుంటున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు.
మార్కెట్ కార్యకలాపాలను సెబీ నియంత్రించాల్సి ఉండగా సెబీ చీఫ్, ఆమె భర్త అదానీ గ్రూప్ విదేశీ ఫండ్లలో వాటాలు కలిగిఉన్నారని వివరించారు. మరి ఈ క్రమంలో సెబీ మార్కెట్‌ను ఎలా నియంత్రిస్తుంది, సెబీ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందా అనే సందేహాలు వెల్లడవుతున్నాయని చెప్పారు. సెబీ అధిపతిగా కొనసాగేందుకు ఆమెకు ఏమాత్రం నైతిక హక్కు లేదని, తక్షణమే సెబీ చీఫ్‌గా వైదొలగాలనే డిమాండ్లు ముందుకొచ్చాయని అన్నారు.
హిండెన్‌బర్గ్ నివేదికలో తీవ్రమైన అంశాలు వెలుగుచూశాయని, ఇందులో ఆర్ధిక, రాజకీయ అంశాలు ఇమిడిఉండటంతో ఉన్నతస్ధాయి దర్యాప్తు చేపట్టాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలన్నింటిపై లోతైన దర్యాప్తు జరిపేందుకు జేపీసీ ఏర్పాటు చేయడం మేలని చెప్పారు. రాహుల్ గాంధీ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటును కోరుతున్నారని తెలిపారు. ఆర్ధిక వ్యవస్ధను సరిగ్గా నిర్వహించడం లేదని, పాలకులు కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక వ్యవస్ధ ఛిద్రమవుతున్నదని, ఇప్పుడిదే అందరినీ బాధిస్తున్న విషయమని ఆయన పేర్కొన్నారు.
Read More :
Divvala Madhuri | దువ్వాడ శ్రీను వ్యవహారంలో ట్విస్ట్.. ఆత్మహత్యకు యత్నించిన మాధురిపై కేసు నమోదు