Divvala Madhuri | ఏపీలో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. దువ్వాడ శ్రీనుతో సంబంధం పెట్టుకుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న పలాస జాతీయ రహదారిపై యాక్సిడెంట్ చేసినందుకు గానూ ఆమెపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించినందుకు చట్ట ప్రకారం ఆమెపై కేసులు పెట్టారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 కింద ఈ కేసు నమోదైంది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదాలు ఇటీవల రోడ్డుకెక్కాయి. దివ్వల మాధురితో దువ్వాడ శ్రీను సంబంధం పెట్టుకుని.. తమకు దూరంగా ఉంటున్నారని ఆయన భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు ఆందోళనకు దిగారు. దీంతో దువ్వాడ వాణి, దివ్వల మాధురి మధ్య మాటల యుద్ధం మొదలైంది. రెండు మూడు రోజులుగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు దివ్వల మాధురి యాక్సిడెంట్‌కు గురైంది. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా లక్ష్మీపురం టోల్‌గేట్‌కు సమీపంలో ఆగివున్న కారును ఢీకొట్టారు. దీంతో మాధురి ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. ఈ యాక్సిడెంట్లో మాధురికి గాయాలు కావడంతో పలాస ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సకు నిరాకరించిన మాధురి.. చనిపోవాలనే యాక్సిడెంట్ చేసుకున్నట్లు బయటపెట్టింది.
అయితే, తనకు ప్రమాదం జరగడానికి కారణం వాణియే అని మాధురి ఆరోపించారు. ఆమె బాధపడలేకనే ఇలా యాక్సిడెంట్ చేసుకుని చనిపోవాలని అనుకున్నానని చెప్పింది. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దువ్వాడ వాణి అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపింది. తన పిల్లలకు డీఎన్ఏ టెస్టు చేయాలని అంటున్నారని, దీంతో మనస్తాపానికి గురై లారీని ఢీకొట్టి ఆత్మహత్య చేసుకుందామని కారులో రోడ్డుపైకి వచ్చానని వెల్లడించారు. దువ్వాడ వాణిని అరెస్టు చేస్తేనే ట్రీట్మెంట్ తీసుకుంటానని మొండికేశారు. కానీ దాదాపు గంటన్నర తర్వాత బలవంతంగా వైద్యులు చికిత్స అందించారు.