న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నానికి అది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం తేజ్ తుఫాను కారణంగా గంటకు గరిష్టంగా 62 నుంచి 88 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, ఈ ఈదురు గాలుల వేగం గంటకు 89 నుంచి 117 కిలోమీటర్ల గరిష్ఠానికి చేరితే దాన్ని తీవ్ర తుఫానుగా పరిగణిస్తామని ఐఎండీ తెలిపింది.
ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారి, ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారుతోందని ఐఎండీ తన తాజా ప్రకటనలో పేర్కొంది. ఈ తుఫాను మన దేశంలో గుజరాత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అయితే పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నందున గుజరాత్ తూర్పు ప్రాంతంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేసింది.
కాగా, ఈ ఏడాది జూన్‌లో అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను గుజరాత్ లోని కచ్, సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. తొలుత పశ్చిమ దిశగా పయనించిన తుఫాను ఆ తర్వాత దిశ మార్చుకుని కచ్‌లో తీరం దాటింది. అరేబియా సముద్రంలో ఈ ఏడాది ఏర్పడిన రెండో తుఫాను తేజ్. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానులకు పేర్లు పెట్టడానికి అనుసరిస్తున్న ఫార్ములా ప్రకారం దీనికి ‘తేజ్’ అని నామకరణం చేశారు.
ఈ తేజ్ తుఫాను ఇవాళ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి ఒమన్, దానిని ఆనుకుని ఉన్న యెమెన్ దక్షిణ తీరాల వైపు కదులుతున్నదని ఐఎండీ తెలిపింది. కొన్ని సార్లు ఈ తుఫానులు ఆకస్మాత్తుగా దిశను మార్చుకునే అవకాశం ఉన్నదని, దాంతో ఈ తుఫాను ఎక్కడ తీరాన్ని తాకనుందనేది ఇప్పుడు కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది.