హైదరాబాద్: రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ (Cyclone Montha) ఛత్తీసగఢ్లోకి ప్రవేశించింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోకి తీవ్ర అల్ప పీడనంగా ప్రవేశించింది. దీని ప్రభావంతో ఆ రాష్ట్రంతోపాటు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఉత్తర తెలంగాణలో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లాలో చెట్టు కూలడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఖమ్మం జిల్లాలో డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దంచికొట్టిన వానతో రహదారులపై మోకాళ్ల లోతు వరద చేరడంతో ప్రధాన జంక్షన్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. హంటర్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు, హనుమకొండ చౌరస్తా, బస్‌స్టేషన్ రోడ్డు, అంబేద్కర్ జంక్షన్ ప్రాంతాలతోపాటు వరంగల్ అండర్‌బ్రిడ్జి, చిన్నబ్రిడ్జి, వరంగల్ చౌరస్తా, హెడ్ ఫోస్టాఫీస్ జంక్షన్, పాతబీటు బజార్, బట్టల బజార్, ఆర్టీఏ కార్యాలయం జంక్షన్లు జలమయమయ్యాయి.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు కాజ్వే పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ పట్టణంలో భారీ వర్షం కురవడంతో రైలు పట్టాలపైకి వరద చేరింది. దీంతో రైళ్లను ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో లింగాల గట్టు వద్ద, అచ్చంపేట సమీపంలోని ఉమామహేశ్వర క్షేత్రం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. నాగర్‌కర్నూల్, అచ్చంపేట పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు, రహదారులన్నీ జలమయమయ్యాయి. దుందుభీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కాగా నాగర్‌కర్నూల్ జిల్లా డిండి ప్రాజెక్టు వద్ద కల్వర్టు కూలడంతో శ్రీశైలానికి రాకపోకలు నిలిచిపోయాయి.
కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు జీవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలలో 35 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోగా.. డ్రైవర్ నీటిలో గల్లంతయ్యాడు. రంగారెడ్డి జిల్లాలోని అనేక చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇంజాపూర్, తొర్రూరు గ్రామాల మధ్య వరద తీవ్రతకు కారు నీట మునిగింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్కు చెందిన నర్సయ్య ప్రమాదవశాత్తు కాగ్నా వాగులో కొట్టుకుపోతుండగా తాండూర్ మండలం వీర్‌శెట్టిపల్లి సమీపంలోని బ్రిడ్జి సమీపంలో ఓ ఇద్దరు వ్యక్తులు తాళ్ల సాయంతో కాపాడారు.నీట మునిగిన గురుకులాలు
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మెపల్లిలోని బాలుర గిరిజన పాఠశాల పరిసర ప్రాంతం పూర్తిగా వరదముంపులో చిక్కుకుపోయింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ భవనం చుట్టూ వర్షపు నీరు చేరడంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు.