చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ (Cyclone Fengal) తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని, దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిపై తుఫాను విరుచుకుపడింది. భారీ వర్షాలు, వరదలతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. తమిళనాడులో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి.
గత 34 గంటల్లో చాలా ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల నుంచి 27 సెంటీ మీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. చెన్నై నగరవ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారుల అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. బలమైన గాలులు వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని, వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరెంటు షాక్‌తో ముగ్గురు మరణించారు. ఇక 14 గంటల తర్వాత చైన్నై విమానాశ్రయం తెరుచుకున్నది. ఎయిర్‌పోర్టులోకి నీరు చేరడంతో శనివారం మధ్యాహ్నం విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. పలు విమానాలను రద్దుచేశారు. అయితే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఎయిర్‌పోర్టులో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే విమాన సర్వీసులు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఏపీలో భారీ వర్షాలు..
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో తడ దగ్గర జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాన నీరు నిలిచింది. జిల్లాలోని సూళ్లూరుపేట తడ, దొరవారిసత్రం, నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, ఏర్పేడు, నారాయణవనం, కేవీబీపురం మండలాల పరిధిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో.. గూడూరు, కోట, వాకాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.