Cyber Crimes | జాతీయ భద్రతా కారణాల నేపథ్యంలో 14సీ సిఫారసుల మేరకు 805 యాప్స్‌తో పాటు 3,266 వెబ్‌సైట్స్ లింక్స్‌ను బ్లాక్ చేశారు. 19లక్షలకు పైగా మ్యూల్ ఖాతాలను పట్టుకోవడంతో పాటు రూ.22,038 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేశారు. న్యూఢిల్లీలో ‘సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్’ అనే అంశంపై హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా వివరాలను వెల్లడించారు. గత కొన్నేళ్లుగా భారత్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించాయని.. దాంతో సైబర్ దాడుల సంఖ్య సహజంగానే పెరిగిందన్నారు. ఈ సైబర్ మోసాలను నియంత్రించకపోతే సైబర్ స్పేస్ సమస్యలను పరిష్కరించడం అసాధ్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని హోం మంత్రిత్వ శాఖ భారతదేశాన్ని సైబర్ సురక్షితంగా మార్చడానికి అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుందని షా పేర్కొన్నారు.
సైబర్ నేరాలు అన్ని భౌగోళిక సరిహద్దులను తొలగించిందని.. ఇది సరిహద్దులు లేని.. నిరాకార నేరమని.. దీనికి పరిమితులు, స్థిర రూపం లేదన్నారు. గత దశాబ్దంలో భారతదేశం డిజిటల్ విప్లవం చూసిందన్నారు. డిజిటల్ విప్లవం పరిమాణం, స్థాయిని అర్థం చేసుకోకుండా.. మనం సైబర్ రంగం సవాళ్లను ఎదుర్కోలేమన్నారు. ప్రస్తుతం దేశం 95శాతం గ్రామాలు డిజిటల్‌గా అనుసంధానమయ్యాయని.. లక్ష పంచాయతీలు వై-ఫై హాట్‌స్పాట్ సేవలతో కనెక్ట్ అయి ఉన్నాయన్నారు. గత పదేళ్లలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నాలుగున్నర రెట్లు పెరిగిందన్నారు. 2024 సంవత్సరంలో రూ.17, 221 లక్షల కోట్ల విలువైన.. 246 లక్షల కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయని పేర్కొన్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన డిజిటల్ లావాదేవీలలో 48 శాతం భారతదేశంలోనే జరిగాయని షా చెప్పారు.
స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ పరంగా భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశంగా కూడా అవతరించిందని.. 2023లో జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సహకారం దాదాపు రూ.32 లక్షల కోట్లుగా తెలిపారు. భారత్‌లో సైబర్ నేరాలు జరగకూడదని.. ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాకూడదని హోంమంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు కన్వర్జెన్స్, కోర్డినేషన్, కమ్యూనికేషన్, కెపాసిటీ వంటి నాలుగు వ్యూహాలతో నిర్దిష్ట లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. సైబర్ నేరాలను నివారించడానికి ప్రజలలో అవగాహన పెంచడంపై హోం మంత్రి నొక్కి చెబుతూనే, కమిటీ సభ్యులందరూ హెల్ప్‌లైన్ 1930ని ప్రోత్సహించాలని కోరారు. సైబర్ ఆర్థిక మోసాలను దృష్టిలో ఉంచుకుని.. ‘1930’ హెల్ప్‌లైన్ నంబర్ సౌకర్యాలకు ఒక పాయింట్ పరిష్కారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి, రిజర్వ్ బ్యాంక్, అన్ని ఇతర బ్యాంకులతో సమన్వయంతో మ్యూల్ ఖాతాలను గుర్తించడానికి ఓ వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. I4సీ పోర్టల్‌లో 1.43లక్షల ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. 19కోట్లకుపైగా ఈ పోర్టల్‌ను వినియోగించుకున్నారని తెలిపారు. జాతీయ భద్రత నేపథ్యంలో 805 యాప్‌లు, 3266 వెబ్సైట్ లింక్‌లను బ్లాక్ చేసినట్లు వివరించారు. 19 లక్షలకుపైగా మ్యూల్ ఖాతాలను బ్లాక్ చేయడంతో పాటు రూ.2038 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేసినట్లు ఆయన వివరించారు.