న్యూఢిల్లీ: నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌కు పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ సైబర్ మోసానికి గత ఏడాది చాలా మంది బలయ్యారని తన వార్షిక నివేదికలో తెలిపింది. 2024 మొదటి త్రైమాసికంలో ఈ స్కామ్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వాట్సాప్ ద్వారా 14,746, టెలిగ్రామ్ నుంచి 7651, ఇన్స్టాగ్రామ్ ద్వారా 7152, ఫేస్బుక్ నుంచి 7051, యూట్యూబ్ ద్వారా 1135 మోసాలు జరిగినట్టు కేసులు నమోదయ్యాయి. ‘గూగుల్ అడ్వైర్టెజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్, ఫేస్బుక్ స్పాన్సర్ లింక్‌ల ద్వారా మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ కొత్త స్కామ్‌లో భారీగా మనీ లాండరింగ్‌తో పాటు సైబర్ బానిసత్వం కూడా భాగమైంది’ అని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
2016లో చైనాలో ఈ స్కామ్ ప్రారంభమైనట్టు భావిస్తారు. సైబర్ నేరగాళ్లు ముందుగా ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ వంటి వేదికల ద్వారా ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తారు. భారీగా లాభాలు వస్తాయనే ఆశలు కల్పించి క్రిప్టో కరెన్సీ, ఇతర నకిలీ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడులు పెట్టిస్తారు. కొన్ని రోజుల పాటు లాభాలు ఎరగా వేస్తారు. లాభాలు వస్తున్నాయని నమ్మి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన తర్వాత ముంచేస్తారు. పందులకు బాగా దాణా వేసి, లావెక్కిన తర్వాత వధించే వ్యక్తి తీరులా ఈ మోసాలు ఉంటాయని దీనిని ‘పిగ్ బుచరింగ్ స్కామ్’ అని పిలుస్తున్నారు.