Cyber crime : ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్ (Digital Arrest)’ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. అమాయకులే కాదు, చదువుకున్న వాళ్లు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులూ సైబర్ నేరగాళ్ల (Cyber criminals) బారిన పడుతున్నారు. తాజాగా కర్ణాటక (Karnataka) కు చెందిన ఓ ఎంపీ భార్య కూడా నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెను బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్నారు.
ముంబై సైబర్ డిపార్ట్మెంట్ అధికారినంటూ చిక్కబళ్లాపూర్ ఎంపీ కే సుధాకర్ భార్య ప్రీతికి ఓ వ్యక్తి కాల్ చేశాడు. సద్బత్ఖాన్ అనే వ్యక్తి ఆమె పత్రాలు ఉపయోగించి, క్రెడిట్ కార్డ్ పొందాడని ఆ కాలర్ పేర్కొన్నాడు. దాంతో చట్టవిరుద్ధమైన లావాదేవీలు చేశాడని బెదిరించాడు. తాము సద్బత్ఖాన్ను అరెస్టు చేశామని, అతడు ఇచ్చిన స్టేట్మెంట్లో మీ పేరు చెప్పాడని ప్రీతిని భయపెట్టాడు.
డాక్యుమెంట్లు ధ్రువీకరించేందుకు వీడియో కాల్ చేయాలని, లేకపోతే అన్ని ఖాతాలను నిలిపివేస్తామని బెదిరించాడు. తాము చెప్పినట్లు చేస్తే ఎలాంటి సమస్య ఉండదని, రూ.14 లక్షలు పంపించాలని ఆ కేటుగాడు ఆమెను ఒప్పించాడు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ డబ్బును మళ్లీ రీఫండ్ చేస్తామని చెప్పాడు. అతడి మాట విని డబ్బు పంపగానే కాల్ కట్ అయ్యింది.
ఆ తర్వాత తాను మోసపోయినట్లు గ్రహించిన ప్రీతి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బాధితురాలి ఫిర్యాదుతో వేగంగా స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రీతి పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేశారు. వెంటనే నిందితుల ఖాతాను ఫ్రీజ్ చేసి, ఆర్బీఐ అనుమతితో బాధితురాలి ఖాతాలో రీఫండ్ చేశారు.
కాగా సైబర్ కేటుగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట కొత్త తరహాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. సమాజంలో తమ ప్రతిష్ఠ దెబ్బతింటుందనే భయం, కుటుంబసభ్యులపై ప్రభావం వంటి భయాలవల్ల చాలామంది నేరగాళ్ల బెదిరింపులకు తలొగ్గుతున్నారు.