న్యూఢిల్లీ: సాధారణంగా పెద్ద ఏనుగులపై దాడిలో మొసళ్లు నెగ్గలేవు. కొంత నష్టం కలిగించేలోపు ఏనుగులు తమ బలమైన పాదాలతో మొసళ్లను తొక్కి చంపుతాయి. ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఏనుగుల మంద నీటి ఏటిని దాటుతున్నది. ఆ మందలోని ఏనుగు పిల్లపై ఒక మొసలి దాడి చేసింది. నోటితో ఏనుగు తొండాన్ని పట్టుకుంది. మొసలి దాడిని గమనించిన మిగతా ఏనుగులు పక్కకు తప్పుకుని నీటి ఒడ్డుకు చేరుకున్నాయి.
కాగా, తన పిల్లపై మొసలి దాడి చేయడాన్ని గ్రహించిన తల్లి ఏనుగు దానిపై ప్రతిదాడి చేసింది. వెంటనే పిల్లను ఆ మొసలి బారి నుంచి కాపాడి మంద వద్దకు పంపింది. ఆ తర్వాత ఆ మొసలి భరతం పట్టింది. తన తొండంతో దానిని ఎత్తిపడేసింది. ఆపై తన బలమైన పాదాలతో మొసలిని తొక్కి తొక్కి చంపింది. ‘వైల్డ్ లైఫ్ కల్చర్1’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.