వడోదర: గుజరాత్లోని వడోదరలో గత నెల 27-29 మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల మొసళ్లు జనావాసాల్లోకి కొట్టుకొచ్చాయి. విశ్వమిత్రి నది నీటి మట్టం పెరుగుతుండటంతో ఇవి బయటకు వచ్చేశాయి. అటవీ శాఖాధికారులు 24 మొసళ్లను పట్టుకున్నారు. విశ్వమిత్రి నదిలో దాదాపు 440 మొసళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అజ్వా ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేయడంతో కొన్ని మొసళ్లు బయటకు వచ్చాయని వడోదర రేంజ్ అటవీ శాఖాధికారి కరణ్సింహ్ రాజ్పుత్ చెప్పారు. తాము పట్టుకున్న మొసళ్లలో అతి చిన్నదాని పొడవు రెండు అడుగులు అని, అతి పెద్దదాని పొడవు 14 అడుగులు అని వివరించారు. నీటి మట్టం తగ్గిన తర్వాత వీటిని తిరిగి నదిలో వదిలిపెడతామని చెప్పారు.