పాట్నా: బీజేపీ-జనతాదళ్ యునైటెడ్ పాలిత బీహార్లో వంతెనల నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభించి రెండు రోజులు కాకముందే దాని నట్లు, బోల్టులను కొందరు పిల్లలు చేత్తో తీసి పడేశారు. ఈ ఘటన ఇటీవల పాట్నాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో వంతెనల భద్రతపై పెద్ద చర్చే మొదలైంది. నెటిజన్లు ఈ విషయమై తీవ్రంగా స్పందించారు.
రాష్ట్ర భవన నిర్మాణ శాఖ పనితీరును ఈ ఘటన వెలుగులోకి తెచ్చిందని ఒకరు ఘాటుగా స్పందించారు. ఆ పిల్లలు కేవలం చేతివేళ్లతోనే వాటిని తొలగించడం నిర్మాణంలో అద్భుతం అంటూ మరొకరు వ్యంగ్యంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీహార్లో నిరుడు నెలల వ్యవధిలోనే సుమారు 15 వంతెనలు కూలిపోయాయి. ఈ ఘటనలతో వంతెనల నిర్మాణం, వివిధ శాఖల పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.