న్యూఢిల్లీ, మార్చి 19 : రాజ్యసభలోని 229 మంది సభ్యుల్లో 73 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్’ (ఏడీఆర్) నివేదిక తెలిపింది. 27 మందితో బీజేపీ టాప్లో ఉన్నట్టు పేర్కొన్నది. రాజ్యసభలోని 31 మంది ఎంపీల ఆస్తులు రూ.1,000 కోట్లపైనే ఉందని, చాలామంది ఆస్తి రూ.100 కోట్లపైనే ఉందని నివేదిక వెల్లడించింది.
రాజ్యసభకు కొత్తగా 37 మంది ఎంపిక కాగా, ఎంపీలందరి అఫిడవిట్లను విశ్లేషిస్తూ ఏడీఆర్పై గణాంకాల్ని విడుదలచేసింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 73 మంది ఎంపీల్లో 36 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయి. ఒక ఎంపీపై హత్య కేసు, నలుగురు ఎంపీలపై హత్యాయత్నం కేసు, మహిళలపై నేరాలకు సంబంధించి ముగ్గురు ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఎంపీల సగటు ఆస్తి రూ.120.69 కోట్లుగా పేర్కొన్నది. అత్యధికంగా రూ.5,300 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఓ ఎంపీ తన అఫిడవిట్లో పొందుపర్చాడు.