Crime news : కంపెనీ యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం ఓ హోటల్లో పనిచేస్తున్న యువకుడిని.. అంతకుముందు పనిచేసిన కంపెనీ యజమాని దారుణంగా పొడిచి చంపాడు. దేశ రాజధాని ఢిల్లీలోని సంగమ్ విహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని ప్రముఖ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్న సచిన్ కుమార్ (22).. అంతకుముందు సంగమ్ విహార్‌లో షాహిబ్ ఖాన్‌కు చెందిన టీ-షర్టుల తయారీ కంపెనీలో పనిచేసేవాడు. అయితే గత ఆదివారం రాత్రి నుంచి అతను కనిపించకుండా పోయాడు. దాంతో సచిన్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సచిన్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఎంక్వయిరీ చేశారు.
పోలీసుల విచారణలో మాజీ కంపెనీ యజమాని షాహిబ్ ఖాన్ భార్య షబీనా బేగంతో సచిన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. అంతేగాక షాహిబ్ ఖాన్ దగ్గర రూ.2 లక్షలు అప్పు కూడా తీసుకున్నట్లు వెల్లడైంది. కంపెనీ మారిన సచిన్‌ను షాహిబ్ ఖాన్ అప్పు కోసం ఒత్తిడి చేయడంతో రూ.1 లక్ష చెల్లించాడు. మిగతా లక్ష కోసం అడిగినా లెక్క చేయడంలేదు. ఈ క్రమంలో సచిన్ హత్యకు షాహిబ్ కుట్రపన్నాడు.
భార్యతో సచిన్ వివాహేతర సంబంధం గురించి తెలుసుకుని పథకం వేశాడు. ఆమెతో బలవంతంగా ఫోన్ చేయించి సచిన్‌ను ఇంటికి రప్పించాడు. సచిన్ ఇంట్లోకి రాగానే కత్తితో విచక్షణారహితంగా పొడిచిచంపాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి దస్నా ఏరియాలో అటవీ ప్రాంతంలో పడవేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్లు సమాచారం మేరకు శుక్రవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు.