Crime news : రోడ్డు పక్కన ఉన్న పాన్ షాపు (PAN shop) దగ్గర ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer) తన స్నేహితుడితో కలిసి సిగరెట్ (Cigarette) తాగుతున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి కారులో అక్కడికి వచ్చాడు. తనకు ఒక సిగరెట్ కొని అందించమని సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు డబ్బులు ఇవ్వబోయాడు. అందుకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిరాకరించాడు. అంత సోమరితనం ఎందుకని ప్రశ్నించాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకుని అవతలి వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను కారుతో గుద్ది చంపేశాడు. కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని విరాజహల్లి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల హెచ్ఎన్ సంజయ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున తన కంపెనీకి సమీపంలోని కనకపుర రోడ్డులో వసంతపుర క్రాస్ దగ్గరికి సిగరెట్ తాగేందుకు స్నేహితుడు చేతన్‌తో కలిసి వచ్చాడు. ఇద్దరూ సిగరెట్ తాగుతుండగా ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల ప్రతీక్ అక్కడికి కారులో వచ్చాడు. అతను కారులోని కూర్చుని ఒక సిగరెట్ కొని ఇవ్వమని సంజయ్‌కు డబ్బులు ఇవ్వబోయాడు.
కానీ సంజయ్ అందుకు నిరాకరించాడు. దిగి తీసుకోవచ్చుగా.. అంత సోమరితనం ఎందుకు అని అతడిని ప్రశ్నించాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడున్నవాళ్లు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. అనంతరం ప్రతీక్ అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి కారులో తన భార్యతోపాటు కాపుగాశాడు. సంజయ్, చేతన్‌లు బైక్‌పై బయలుదేరగానే ఆ బైకును వెనుక నుంచి బలంగా కారుతో గుద్దేశాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయమై సంజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చున్న చేతన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రతీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు నగరంలోని రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనకు పాల్పడిన సమయంలో ప్రతీక్ తన భార్యతో కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్నాడని, ఆ సమయంలో అతడు బాగా మద్యం సేవించి ఉన్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.