హైదరాబాద్, సెప్టెంబర్ 30 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘అచ్చేదిన్’ తెస్తామని గద్దెనెక్కిన కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజలకు సచ్చేదినాలను చూయిస్తున్నది. బీజేపీ పాలనలో అన్నంపెట్టే రైతన్నకు దిక్కులేకుండా పోయింది. మహిళలను దేవతలుగా పూజించే ఈ పుణ్యభూమిలో ఆడబిడ్డలకు భద్రత కరువయ్యింది. దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. పసిమొగ్గలపై మృగాళ్ల దాడులు తీవ్రమయ్యాయి. మొత్తంగా దేశంలో నేరాలు-ఘోరాలు రాజ్యమేలుతున్నాయి.
జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్సీఆర్బీ-2023) విడుదల చేసిన తాజా గణాంకాలే దీనికి రుజువు. అంతేకాదు ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు సామాన్యుల జీవితాలను కకావికలం చేస్తున్నాయి. ఇలా ముప్పేట దాడులతో ఒకవైపు పేద, మధ్యతరగతి ప్రజానీకం అల్లాడుతుంటే.. ప్రధాని మోదీ సహా అధికార పార్టీ నేతలందరూ ఓట్ల వేటలో బిజీగా ఉండటం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది.
ప్రభుత్వం నుంచి ఆసరా లేకపోవడం.. అప్పుల బాధలు తాళలేక దేశంలో గంటకు ఓ రైతన్న ప్రాణాలు తీసుకొంటున్నట్టు ఎన్సీఆర్బీ తాజా గణాంకాలను బట్టి తెలుస్తున్నది. 2023లో వ్యవసాయ రంగంలో పనిచేసే 10,700 మంది రైతులు, రైతుకూలీలు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఎన్సీఆర్బీ నివేదిక కుండబద్దలు కొట్టింది. రైతు ఆత్మహత్యల్లో 38.5 శాతం వాటాతో బీజేపీపాలిత మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, 22.5 శాతం వాటాతో కాంగ్రెస్ పాలిత కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. దేశంలో వివిధ కారణాలతో 2023 ఒక్క ఏడాదిలోనే 1,71,418 మంది ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నివేదిక వెల్లడించింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, నిరుద్యోగం తదితర సమస్యలతోనే దేశంలో ఆత్మహత్యలు పెరిగినట్టు నివేదికను బట్టి తెలుస్తున్నది.
ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారని అంటారు. అయితే, బీజేపీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4,48,211 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. ఈ నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు టాప్-3 స్థానాల్లో ఉండటం గమనార్హం. 66,381 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, 47,101 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 45,450 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది.
మహిళలపై నేరాల్లో హత్యలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, గృహహింస, వరకట్న వేధింపులు తదితరాలు ప్రధానంగా ఉన్నాయి. ఇక చిన్నారులపై జరుగుతున్న నేరాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే 1,77,335 మంది పిల్లలపై దారుణాలు జరిగాయి. 2022తో పోలిస్తే ఈ నేరాలు 9.2 శాతం మేర పెరిగాయని నివేదిక వెల్లడించింది.
2022తో పోలిస్తే 2023లో ఎస్టీలపై నేరాలు ఏకంగా 28.8 శాతం పెరిగాయి. 2022లో ఎస్టీలపై నేరాలు 10,064గా ఉండగా, ఆ మరుసటి ఏడాది 12,960కి పెరిగాయి. 2023లో మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలతో యావత్తు ప్రపంచం విస్మయానికి గురైంది. దీనికి నిదర్శనంగా 2023లో ఎస్టీలపై ఎక్కువ నేరాలు జరిగిన రాష్ర్టాల్లో 3,399 కేసులతో మణిపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక, 2023లో దేశవ్యాప్తంగా 27,721 హత్యలు జరిగాయి. 2023లో 86,420 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి.
2022తో పోలిస్తే సైబర్ క్రైమ్ కేసులు 2023లో 31.2 శాతం పెరిగినట్టు తెలుస్తున్నది. ఇదిలాఉండగా 2023లో రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షల మంది మరణించినట్టు నివేదిక వివరించింది. మొత్తంగా మోదీ ప్రభుత్వ హయాంలో నేరాలకు అడ్డాగా దేశం మారిందని, శాంతి-భద్రతలు, ప్రజా సంక్షేమం గాలిలో దీపంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రేమ వ్యవహారాలు-4.7 శాతం