Supreme Court | తమిళనాడు ప్రభుత్వం తీరుపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి వీ సెంథిల్ బాలాజీ ప్రమేయం ఉన్న ఉద్యోగ కుంభకోణంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి మాజీ మంత్రి డబ్బులు తీసుకున్నట్లుగా అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. జస్టిస్ సూర్యకాంత్, జోయ్మల్య బాగ్చి ధర్మాసనం తమిళనాడు సర్కారుపై మండిపడింది. ప్రభుత్వం కావాలనే విచారణను ఆలస్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని మండిపడింది. ప్రభుత్వం కేసును మూసివేసేందుకు ప్రయత్నిస్తే.. న్యాయశాఖ అడ్డుకుందంటూ మందలించింది.
ఈ కేసులో 2000 మంది నిందితులు, 500 మంది సాక్షులుగా ఉన్నారన్న ధర్మాసనం.. భారత్లో అత్యధిక మంది విచారణలో పాల్గొన్న కేసు ఇదే అవుతుందేమోనని వ్యాఖ్యానించింది. నిందితులందరికీ కోర్టు గది సరిపోదని.. ఓ క్రికెట్ స్టేడియం కావాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుడు, సాక్షుల పూర్తి వివరాలు సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం తమిళనాడు సర్కారును ఆదేశించింది. బాలాజీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ విచారణకు హాజరయ్యారు. అన్నాడీఎంకే హయాంలో సెంథిల్ బాలాజీ రవాణాశాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీలో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రవాణాశాఖ కేసులో ఆయనను ఈడీ 2023లో అరెస్టు చేసింది.
దాదాపు ఏడాదికిపైగా ఆయన జైలులో ఉన్నారు. బెయిల్పై వచ్చాక ఆయనకు స్టాలిన్ ప్రభుత్వం ఆయనను మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఈ కేసు సుప్రీంకోర్టు వరకు చేరడంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంతకు ముందు ఈ కేసులో మంగళవారం సైతం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కుంభకోణంలో 2వేలమందికి పైగా నిందితులుగా పేర్కొంటూ.. బాలాజీకి సంబంధించిన కేసుల విచారణను ఆలస్యం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసులో బెయిల్ మంజూరైన కొద్దిరోజులకే తిరిగి మంత్రిగా నియమించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 26న బెయిల్ రాగా.. 29న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్ కేబినెట్లో గతంలో నిర్వహించిన శాఖలనే మళ్లీ కేటాయించారు.