Taj Mahal | ఆగ్రా, సెప్టెంబర్ 22: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరొంది, పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే ఆగ్రాలోని తాజ్‌మహల్ లోపభూయిష్టమైన నిర్వహణతో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఫలితంగా ఈ పాలరాతి కట్టడంలోని గోడలు, ఫ్లోరింగ్ పలు చోట్ల దెబ్బతినడమే కాక, పగుళ్లు కూడా దర్శనమిస్తున్నాయి. ఇటీవల ఆగ్రాలో కురిసిన భారీ వర్షం కారణంగా ఇవి మరింత పెరిగినట్టు భావిస్తున్నారు.
గతంలో ప్రధాన గోపురం చుట్టూ ఉన్న తలుపులపై అరబిక్‌లో ఖురాన్ శ్లోకాలు ఉండేవి. ఇప్పుడవి చెరిగిపోయాయి. గోడలలో పొదిగిన విలువైన రాళ్లు కూడా అవసాన దశకు చేరుకుంటున్నాయని టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి షకీల్ చౌహాన్ తెలిపారు.
పశ్చిమ దిశలో కట్టడానికి ఎదురుగా ఉన్న ఫ్లోరింగ్‌పై రాళ్లు ముక్కలయ్యాయని, ప్రధాన సమాధి ప్రాంతం, ప్రధాన గుమ్మటం వద్ద గోడలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాజ్‌మహల్ కట్టడానికి సంబంధించి ఎలాంటి తీవ్ర సమస్యలు లేవని తాజ్‌మహల్ నిర్వహణను చూస్తున్న భారత పురావస్తు సంస్థ (ఏఎస్ఐ) స్పష్టం చేసింది. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షానికి తాజ్‌మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీరు కారడమే కాక, కట్టడం ముందున్న తోట నీట మునిగిన విషయం తెలిసిందే.