Jammu Kashmir : ఆర్టికల్ 370పై కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ వైఖరిని పాకిస్తాన్ రక్షణ మంత్రి సమర్ధించడంపై సీపీఐ నేత డీ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. మన అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి తలదూర్చడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌కూ ఇది వర్తిస్తుందని అన్నారు. జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ అనంతరం పాకిస్తాన్ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని నిలదీశారు.
భారత్ అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం నివారించాల్సిన అవసరం ఉందని అన్నారు. జమ్ము కశ్మీర్ ప్రజలు పరిణితి చెందిన వారని, జమ్ము కశ్మీర్‌కు, దాని భవిష్యత్‌కు ఏం చేయాలనేది వారికి స్పష్టంగా తెలుసునని వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని, పాక్ కనుసన్నల్లో నడుస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ జమ్ము కశ్మీర్ ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ ఆరోపించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటన ఈ విషయం విస్పష్టంగా వెల్లడిస్తున్నదని అన్నారు.
పాకిస్తాన్ ట్యూన్స్‌కు వీరు డ్యాన్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ తోలుబొమ్మల్లా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కాగా, ఆర్టికల్ 370పై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరిని పాకిస్తాన్ రక్షణ మంత్రి సమర్ధించడం పట్ల ఫరూక్ అబ్ధుల్లా స్పందించారు. పాకిస్తాన్ ఏం చెప్పిందనేది తనకు తెలియదని వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను పాకిస్తానీ కాదని, భారత పౌరుడినని అన్నారు.
Read More :
KTR | ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలి..? రోడ్డుప్రమాదాలపై కేటీఆర్ ట్వీట్