Hindenburg Report : హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో సెబీ చీఫ్‌పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో తక్షణమే ఆమె పదవి నుంచి వైదొలగాలని సీపీఐ నేత బినయ్ విశ్వం డిమాండ్ చేశారు. ఈ నివేదికలో బహిర్గతమైన విషయాలతో మాధవి పురి బుచ్ సెబీ చీఫ్ పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని అన్నారు. ప్రభుత్వం, సెబీ, షేర్ మార్కెట్లను అదానీ, ఆయన కంపెనీ నియంత్రిస్తోందని విమర్శలు గుప్పించారు.
న్యాయం, సత్యం పట్ల ఆమెకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా సెబీ చీఫ్ పదవి నుంచి మాధవి పురి బుచ్ వైదొలగాలని ఆయన కోరారు. కాగా, అదానీ విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలున్నాయని షార్ట్ సెల్లింగ్ సంస్ధ, మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్ తాజా నివేదిక దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. కార్పొరేట్ కంపెనీల ముందు ప్రస్తుత ప్రభుత్వం ఎలా సాగిలపడుతున్నదనే వివరాలను హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతం చేయడంతో రాజకీయ నేతలు ఈ నివేదికపై భుజాలు తడుముకుంటున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు.
మార్కెట్ కార్యకలాపాలను సెబీ నియంత్రించాల్సి ఉండగా సెబీ చీఫ్, ఆమె భర్త అదానీ గ్రూప్ విదేశీ ఫండ్లలో వాటాలు కలిగిఉన్నారని వివరించారు. మరి ఈ క్రమంలో సెబీ మార్కెట్‌ను ఎలా నియంత్రిస్తుంది, సెబీ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందా అనే సందేహాలు వెల్లడవుతున్నాయని చెప్పారు. సెబీ అధిపతిగా కొనసాగేందుకు ఆమెకు ఏమాత్రం నైతిక హక్కు లేదని, తక్షణమే సెబీ చీఫ్‌గా వైదొలగాలనే డిమాండ్లు ముందుకొచ్చాయని అన్నారు.
Read More :
Katrina Kaif – Sunny Kaushal | మరిదిని పొగడ్తలతో ముంచెత్తిన కత్రినా కైఫ్