Covid | న్యూఢిల్లీ, మే 26: దేశంలో కరోనా వైరస్ నెమ్మదిగా విస్తరిస్తున్నది. ఇప్పటికి దేశంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య వెయ్యి దాటింది. గత వారంలో కొత్తగా 752 మంది వైరస్ బారిన పడ్డారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత వారం రోజుల్లో కొవిడ్ సంబంధిత మరణాలు ఏడు సంభవించినట్టు తెలిపాయి. కేరళలో సోమవారం ఉదయం నాటికి కొత్తగా 335 మంది వైరస్ బారిన పడగా, మొత్తం కేసుల సంఖ్య 430కి చేరింది. ఆ తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. మహారాష్ట్రలో 209 కేసులు (కొత్తగా 153), ఢిల్లీలో 104 కేసులు (కొత్తగా 99) ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆ తరువాతి స్థానాల్లో గుజరాత్ (83), తమిళనాడు (69), కర్ణాటక (47), ఉత్తరప్రదేశ్ (15), రాజస్థాన్ (13), పశ్చిమ బెంగాల్ (12) ఉన్నాయి.
బాధితుల్లో స్వల్ప లక్షణాలే..
ఇన్ఫెక్షన్ సోకుతున్న వారి సంఖ్య కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో అధికంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. వైరస్ విస్తరణపై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌కు చెందిన రెండు కొత్త వేరియంట్లు ఎన్బీ.1.8.1, ఎల్ఎఫ్.7లను దేశంలో గుర్తించామని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలిపింది. ఈ వేరియంట్లు ఆందోళనకరమైనవి కావని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకూ జరిపిన పరీక్షల్లో 53 శాతం నమూనాలు కొవిడ్-19కు చెందిన జేఎన్.1 వేరియంట్‌వని, 26 శాతం బీఏ.2 వేరియంట్‌వని పేర్కొంది. దేశంలో కరోనా విస్తరణపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారని, వైరస్ సోకిన వారందరూ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అప్రమత్తంగా ఉండాలి..
దేశంలో వైరస్ విస్తరణను వివిధ ఏజెన్సీలు గమనిస్తున్నాయని, అయినప్పటికీ సంబంధిత విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ చెప్పారు. క్యాన్సర్ వాధిగ్రస్తులు, రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఏడుగురి మృతి
గత వారం రోజుల్లో దేశంలో కరోనాతో ఏడుగురు మరణించారు. మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలోఒకరు మరణించినట్టు అధికారులు తెలిపారు.