న్యూఢిల్లీ, మే 30 : దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. శుక్రవారం నాటికి(మే 30) దేశంలో 1,828 యాక్టివ్ కేసులు నమోదుకాగా ఇప్పటి వరకు 15 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఆరు మహారాష్ట్రలోనే సంభవించాయి. వెంటనే స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించేందుకు శ్వాసకోశ వ్యాధులు, అంటు వ్యాధుల సర్వే ప్రారంభించింది. గుజరాత్లో గురువారం ఆరు కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఓ 8 నెలల శిశువు కూడా ఉంది. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆ చిన్నారికి వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంది.
కేరళలో ప్రస్తుతం 17 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్ జేఎన్ వేరియంట్ ఎల్ఎఫ్7 కేసులు నమోదవుతున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. జనవరి నుంచి మహారాష్ట్రలో 9,500 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఒక్క గురువారం నాడే మహారాష్ట్రలో 79 కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో ముంబైలో మొత్తం 379 కేసులు నమోదయ్యాయి. జనవరి, ఫిబ్రవరిలో ఒక్కో కేసు, ఏప్రిల్‌లో 4 కేసులు నమోదు కాగా మేలో ఒక్కసారిగా 373 కేసులు నమోదయ్యాయి. జమ్ము కశ్మీరులో గురువారం రెండు కొత్త కేసులు నిర్ధారణయ్యాయి. కొవిడ్ బారిన పడిన వీరిద్దరూ కేరళకు చెందిన విద్యార్థులు.