న్యూఢిల్లీ: అవినీతిరహిత సమాజం కోసం నిందితుడి స్వేచ్ఛకు భంగం వాటిల్లినా న్యాయస్థానాలు వెనుకాడరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవినీతి కేసులో ఓ ప్రభుత్వ అధికారికి ముందస్తు జామీను తిరస్కరిస్త్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. అవినీతి అత్యంత ప్రమాదకరమైనదని అభిప్రాయపడింది. కొన్ని సందర్భాలలో నిందితుడి స్వేచ్ఛకు భంగకరమే అయినప్పటికీ సమాజ హితం కోసం కోర్టులు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ధర్మాసనం పేర్కొంది.
అవినీతి నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద ఓ ప్రభుత్వ అధికారిపై నమోదైన కేసులో ముందస్తు జామీను ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఓ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులపై ఆడిట్ విషయంలో ఆ అధికారి లంచం అడిగినట్టు నిందితుడిపై కేసు నమోదైందని ధర్మాసనం తెలిపింది. అవినీతి పరిమాణం గురించి ఆలోచించరాదని, దాని దుష్ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది.