Supreme Court : న్యాయస్థానాలు (Courts) బకాయిలు వసూలు చేసే రికవరీ ఏజెంట్లు (Recovery agents) కాదని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. సివిల్ వివాదాల (Civil disputes) ను క్రిమినల్ కేసులు (Criminal cases) గా మార్చే ఈ ధోరణి మంచిది కాదని అసహనం వ్యక్తంచేసింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) కు చెందిన ఓ కేసును విచారిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది.
డబ్బు రికవరీ అనేది సివిల్ వివాదమని, సివిల్ వివాదంలో అరెస్టును ఒక సాధానంగా ఉపయోగించరాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. డబ్బు తీసుకున్న వ్యక్తి ఆ డబ్బు రికవరీకి వెళ్లిన వ్యక్తిని కిడ్నాప్ చేశాడని యూపీకి చెందిన ఓ కేసులో పోలీసులు అభియోగాలు మోపడంపై కోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. క్రిమినల్ చట్టాలను దుర్వినియోగం చేస్తోన్న సంప్రదాయాన్ని ఈ కేసు ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించింది.
న్యాయం చేసే విధానానికి ఈ కేసు తీవ్ర ముప్పు అని సుప్రీంకోర్టు పేర్కొంది. బకాయిల మొత్తాన్ని వసూలు చేయడానికి కోర్టులేమీ రికవరీ ఏజెంట్లు కావని, న్యాయవ్యవస్థ దుర్వినియోగాన్ని అనుమతించబోమని కోర్టు స్పష్టంచేసింది. ఎవరినైనా అరెస్టు చేసే ముందు తమ వద్దకు వచ్చిన ఆ కేసు క్రిమినలా..? సివిలా..? అని పోలీసులు సరిగా పరిశీలిన చేయాలని సూచించింది. ఇలాంటి కేసులు పోలీసులను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తాయని పేర్కొంది.
సివిల్ వివాదాల్లో వేధింపుల సాధనంగా క్రిమినల్ చట్టాలను ఉపయోగించకుండా నిరోధించేందుకు తెలివిగా వ్యవహరించాలని యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. పోలీసులు తమవద్దకు వచ్చిన కొన్ని క్లిష్టమైన కేసులు సివిలో.. క్రిమినలో తెలుసుకునేందుకు పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులను జిల్లాలకు ఒకరు చొప్పున నోడల్ అధికారులు నియమించవచ్చని సలహా ఇచ్చింది.