CM siddaramaiah | బెంగళూరు: వాల్మీకి స్కామ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆయనపై నమోదైన 2014నాటి ముడుపుల కేసులో లోకాయుక్త పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణకు ఆదేశించినప్పటికీ పట్టించుకోకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సిద్ధరామయ్య మొదటిసారి సీఎంగా ఉన్నప్పుడు 2014 జూలై 28న మైసూరులోని వివేక్ హోటల్స్ ఎండీ వివేకానంద అలియాస్ కింగ్స్ కోర్టు వివేక్ వద్ద నుంచి రూ.1.3 కోట్ల చెక్కును లంచంగా తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు టర్ఫ్ క్లబ్ లిమిటెడ్‌కు స్టెవార్డ్గా నియమించేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణ. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరగలేదని పేర్కొంటూ గత ఏడాది జూన్ 7న కర్ణాటక లోకాయుక్త డిప్యూటీ ఎస్పీ కోర్టులో కేసు క్లోజర్ రిపోర్టును సమర్పించారు.
లోకాయుక్త నివేదికను సవాల్ చేస్తూ బీబీఎంపీ మాజీ కౌన్సిలర్ రమేశ్ కోర్టును ఆశ్రయించారు. మరోసారి విచారణ జరపాలని ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 21న లోకాయుక్త ఎస్పీని ఆదేశించింది. ఆరు నెలలైనా కేసులో విచారణ జరగలేదు. కోర్టు ఉత్తర్వులపై సమాచారం లేదని, అందుకే విచారణ జరపలేదని విచారణ అధికారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయమూర్తి సంతోశ్ గజానన్ భట్.. లోకాయుక్త పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసి, విచారణను సెప్టెంబరు 12కు వాయిదా వేశారు.