ముంబై : మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గణేష్ నాయక్‌కు బాంబే హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు, ఫిర్యాదుదారు మధ్య పరస్పర సమ్మతితోనే సన్నిహిత సంబంధం ఉందని గుర్తుచేసింది. బెయిల్ దరఖాస్తుదారు ఎమ్మెల్యే అనే ఏకైక కారణంతో ఆయన బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చలేమని జస్టిస్ అనూజా ప్రభుదేశాయ్‌తో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది.
వారం రోజుల్లోగా గణేష్ నాయక్ తన లైసెన్స్డ్ రివాల్వర్‌ను పోలీసులకు అప్పగంచాలని ఆదేశించింది. తనను ఎమ్మెల్యే నాయక్ రివాల్వర్‌తో బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. నాయక్‌ను అరెస్ట్ చేయాల్సివస్తే రూ 25,000 చెల్లించిన తర్వాత బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు పేర్కొంది. సోమ, మంగళవారాల్లో పోలీస్ స్టేషన్లో హాజరై విచారణను ఎదుర్కోవాలని నాయక్‌ను కోరింది.
కాగా మహారాష్ట్ర మాజీ మంత్రి నాయక్‌తో తాను 1995 నుంచి సహజీవనం చేస్తున్నానని మహిళ (42) తన ఫిర్యాదులో పేర్కొంది. 1993లో తాను ఓ క్లబ్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న సమయంలో తమ మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని తెలిపింది. తమ మధ్య శారీరక సంబంధం ఉందని, ఫలితంగా తాను ఓ బిడ్డకు జన్మనిచ్చానని పేర్కొంది.
ఆపై నాయక్ తనను దూరం పెట్టాడని, తన ఫోన్ కాల్స్‌ను పట్టించుకోలేదని ఆరోపించింది. ఒకరోజు నాయక్ తనను ఆఫీస్‌కు లంచ్ చేద్దామని పిలిపించి తుపాకీతో బెదిరించాడని, వేధించడం ఆపకపోతే తనతో పాటు తన బిడ్డను చంపి ఆపై బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించాడని పేర్కొంది. ఇక 2010 నుంచి 2017 వరకూ తమ మధ్య నెలకొన్న సంబంధం పరస్పర సమ్మతితో సాగలేదని ఫిర్యాదులో ఆమె ఆరోపించింది.