లక్నో: పెళ్లై, పిల్లలున్న ఒక జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. (Couple Elopes) వారిద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు షాకయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహరియా గ్రామానికి చెందిన గీత, ఐదుగురు పిల్లల తల్లి. అదే గ్రామానికి చెందిన గోపాల్ నలుగురు పిల్లల తండ్రి. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారం రోజుల కిందట గీత, గోపాల్ తమ జీవిత భాగస్వాములు, పిల్లలను వదిలి పారిపోయారు. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
కాగా, ఏప్రిల్ 5న గీతతో పెళ్లి ఫొటోలను తన ఫేస్బుక్ ఖాతాలో గోపాల్ పోస్ట్ చేశాడు. దీంతో గ్రామం నుంచి పారిపోయిన ఈ జంట వివాహం చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. గీత భర్త శ్రీచంద్, గోపాల్ భార్యకు ఈ విషయం తెలిసింది. తాను కష్టపడి సంపాదించిన రూ.90,000, ఇంట్లో ఉన్న నగలను తీసుకుని గీత పారిపోయిందని ఆమె భర్త శ్రీచంద్ ఆరోపించాడు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పాడు.
మరోవైపు తన భర్త గోపాల్ చనిపోయాడని అతడి భార్య ప్రకటించింది. ‘గోపాల్ ఎక్కడ కావాలంటే అక్కడ నివసించవచ్చు, కానీ నా పిల్లల నిర్వహణ కోసం వారి హక్కు వాటా ఇవ్వాలి. వారి పోషణకు ఆర్థికంగా బాధ్యత వహించాలి’ అని ఆమె డిమాండ్ చేసింది.
కాగా, తమ జీవిత భాగస్వాములు, పిల్లలను విడిచి గీత, గోపాల్ పారిపోయి పెళ్లి చేసుకున్న విషయం తమకు తెలిసిందని సిద్ధార్థ్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. ఆయా కుటుంబాలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.