న్యూఢిల్లీ : పార్లమెంట్ ఆమోదించిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసనలు వెల్లువెత్తాయి. గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్లో పెద్ద ఎత్తున ముస్లింలు ఆందోళనకు దిగారు. కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్తోసహా పలు నగరాల్లో వేలాది ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం రోడ్లపైకి వచ్చారు. వక్ఫ్ బిల్లును తిరస్కరిస్తున్నామన్న నినాదాలు గల ప్లకార్డులు చేతపట్టుకుని జాతీయ జెండాలు ఊపుతూ కోల్కతా నగర వీధులలో భారీ సంఖ్యలో ప్రజలు నిరసనలు తెలిపారు. ఈ నిరసనలను వక్ఫ్ పరిరక్షణ కోసం ఏర్పడిన సంయుక్త వేదిక నిర్వహించినట్టు వార్తా సంస్థలు తెలిపాయి.