శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 01:48:21

ఇంటి నుంచే పనిచేయండి

ఇంటి నుంచే పనిచేయండి

  • కార్యాలయాల్లో సగంమందే ఉండాలి 
  • నెలలో రెండువారాలు ఆఫీసులకు రావాలి 
  • మూడురకాలుగా పనివేళలు
  • కేంద్ర ఉద్యోగులకు సర్కార్‌ ఆదేశాలు 

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర సర్వీసుల్లో దాదాపు సగం మంది ఇంటి నుంచే పనిచేయాలని(వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ కోరింది. ఈ మేరకు గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. మిగతా ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు, 9:30 నుంచి 6 వరకు, 10 నుంచి 6:30 గంటల వరకు మూడు షిఫ్టులుగా సర్దుబాటు చేయాలని ఆయా విభాగాల అధిపతులను కోరింది. మొత్తం ఉద్యోగుల్లో 50 శాతమే(గ్రూపు సీ, గ్రూపు డీ ఉద్యోగులు) కార్యాలయాల్లో ఉండాలని, వారం తప్పించి వారం ఆఫీసులకు హాజరయ్యేలా చూసుకోవాలని సూచించింది. మొదటివారం విధుల కేటాయింపులో కార్యాలయాలకు దగ్గరగా ఉండే ఉద్యోగుల మధ్య పనివిభజన చేయాలని, రవాణాకు సొంత వాహనాలనే ఉపయోగించాలని కోరింది. 

ఇంటి నుంచే పనిచేసే ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఫోన్‌లో అందుబాటులో ఉండాలని సూచించింది. అత్యవసర, ముఖ్యమైన సర్వీసుల్లో ఉండే ఉద్యోగులకు ఈ నిబంధన వర్తించదని పేర్కొన్నది. అన్ని కార్యాలయాల్లో శానిటైజర్లు, థర్మల్‌ స్కాన ర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కార్యాలయాలకు ప్రజలు రాకుండా నిరోధించాలని చెప్పింది. ఉన్నతాధికారులు అధికారిక పర్యటనలు రద్దు చేసుకోవాలని, ముఖ్యమైన సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించాలని సూచించింది. సమాచారం చేరవేసేందుకు ఈ-మెయిల్‌  వినియోగించాలని పేర్కొన్నది. 


logo