చెన్నై: తండ్రీ, ఇద్దరు కొడుకుల మధ్య గొడవ జరిగింది. వారు కొట్టుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఒక పోలీస్ అధికారి అక్కడకు చేరుకున్నారు. తండ్రీ, కొడుకుల గొడవలో జోక్యం చేసుకున్నారు. అయితే ఆ ముగ్గురు కలిసి కొడవలితో ఆయనపై దాడి చేసి నరికి చంపారు. (Cop Hacked To Death) తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఉడుమల్పేట సమీపంలోని కుడిమంగళంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు చెందిన ప్రైవేట్ ఎస్టేట్ ఉన్నది. మూర్తి, అతడి ఇద్దరు కుమారులైన తంగపాండియన్, మణికంఠన్ అక్కడ పని చేస్తున్నారు.
కాగా, సోమవారం రాత్రి మద్యం సేవించిన తండ్రీ కొడుకులు ఘర్షణపడ్డారు. వారు తీవ్రంగా కొట్టుకోవడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో రాత్రివేళ గస్తీ విధుల్లో ఉన్న ఎస్ఎస్ఐ షణ్ముగవేల్ పోలీస్ వాహనంలో అక్కడకు చేరుకున్నారు. తండ్రీ, కుమారుల మధ్య ఘర్షణను నివారించడానికి ఆయన జోక్యం చేసుకున్నారు. గాయపడిన తండ్రి మూర్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఏర్పాటు కోసం ప్రయత్నించారు.
మరోవైపు మూర్తి పెద్ద కుమారుడు తంగపాండియన్తో పోలీస్ అధికారి షణ్ముగవేల్ మాట్లాడుతున్నారు. ఇంతలో వెనుక వైపు నుంచి వచ్చిన చిన్న కుమారుడు మణికంఠన్ కొడవలితో ఆయనపై దాడి చేశాడు. ఆ తర్వాత తండ్రీ, పెద్ద కొడుకు కూడా పోలీస్ అధికారిని వెంటాడారు. ఆ ముగ్గురు కలిసి ఆయనను కొడవలితో నరికి చంపారు. ఇది చూసి పోలీస్ వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
కాగా, పోలీస్ అధికారి షణ్ముగవేల్ హత్యపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆ పోలీస్ అధికారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎస్టేట్ వద్ద జరిగిన ఈ సంఘటనపై ఆ పార్టీ ఇంకా స్పందించలేదు.
Also Read:
Thief Asleep After Robbery | చోరీ తర్వాత అలసి నిద్రపోయిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
Sanjay Nishad | మీ ఇంటి గుమ్మం వద్దకే గంగా నది వచ్చిందన్న మంత్రి.. మీరే ఆశీర్వాదం తీసుకోవాలన్న మహిళ
Watch: సింహాన్ని వీడియో తీసేందుకు వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?