లక్నో: కారులో పారిపోతున్న నిందితులు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. అదుపుతప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో చిక్కుకున్న ఒక నిందితుడ్ని రక్షించి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యుదాఘాతంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. (Cop Dies While Rescuing Criminal) ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 16న శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో చక్కర్ చౌక్ సమీపంలో లారీ డ్రైవర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేయడంతోపాటు కాల్పులు జరిపారు.
కాగా, ఈ విషయం తెలిసి ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులపై కూడా ఆ వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత గంజ్ రాజ్వాహా వైపు కారులో వేగంగా పారిపోయారు. ఒకచోట హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఆ కారు ఢీకొట్టింది. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఒక వ్యక్తి అందులో చిక్కుకున్నాడు.
మరోవైపు ఆ కారును అనుసరించిన పోలీసులు, హీంపూర్ దీపా గ్రామానికి చెందిన నీరజ్ కారులో చిక్కుకున్నట్లు తెలుసుకున్నారు. అతడ్ని కాపాడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుళ్లు మనోజ్ కుమార్, గంగారామ్ ఆ కాలువలోకి దిగారు. నీటిలో పడిన కారును సమీపించి నిందితుడ్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే తెగిన విద్యుత్ వైర్ కాలువ పక్కన పడి ఉండటాన్ని వారు గమనించలేదు. విద్యుత్ వైర్‌ను తాకడంతో కాలువ నీటిలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లు విద్యుదాఘాతానికి గురయ్యారు.
కాగా, వారిని బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మనోజ్ కుమార్ మరణించాడు. మరో కానిస్టేబుల్ గంగారామ్ పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడు నీరజ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయని వెల్లడించారు.
మరోవైపు నిందితుడ్ని కాపాడబోయి విద్యుదాఘాతంతో మరణించిన పోలీస్ కానిస్టేబుల్ మనోజ్ కుమార్‌కు పోలీసు లైన్ వద్ద గౌరవ వందనం సమర్పించారు. బిజ్నోర్ ఎస్పీ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన బాగ్‌పత్‌కు తరలించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
⚠️Trigger Warning : Disturbing Video⚠️
यूपी के जिला बिजनौर में 16 मई की रात सिपाही मनोज की मौत का वीडियो सामने आया। बदमाशों की कार बिजली का खंभा तोड़ती हुई नहर में गिरी। बदमाशों को पकड़ने कई पुलिसकर्मी नहर में कूद पड़े। तभी पानी में करंट उतर आया। एक पुलिसकर्मी चपेट में आ गया। pic.twitter.com/hT1ipdkk2q
— Sachin Gupta (@SachinGuptaUP) May 18, 2025