లక్నో: భారీ వర్షాలకు పోలీస్ స్టేషన్ పైకప్పు కూలింది. రాత్రి విధుల్లో అక్కడ ఉన్న పోలీస్ అధికారిపై శిథిలాలు పడ్డాయి. దీంతో ఆ పోలీస్ అధికారి మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. (Cop Dies As Police Station Roof Collapses) 58 ఏళ్ల వీరేంద్ర కుమార్ మిశ్రా సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ). అంకుర్ విహార్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) కార్యాలయంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, ఉత్తరాదితో పాటు ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఆ పోలీస్ కార్యాలయం పైకప్పు కూలింది. రాత్రి విధుల్లో భాగంగా అక్కడ నిద్రించిన ఎస్ఐ వీరేంద్ర కుమార్ మిశ్రాపై శిథిలాలు పడ్డాయి. దీంతో వాటి కింద ఆయన మరణించారు.
మరోవైపు ఆదివారం ఉదయం విధులకు హాజరైన మిగతా పోలీసులు ఇది చూశారు. శిథిలాల కింద ఉన్న వీరేంద్ర కుమార్ మిశ్రాను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలకు సుమారు 50 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.