న్యూఢిల్లీ: మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజుకు దాదాపు 40,000 అకాల మరణాలను నిరోధించవచ్చు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, బియ్యం, గోధుమలు, రాగులు, జొన్న, వేరుశనగలను పుష్కలంగా తీసుకుంటూ, ఓ మోస్తరుగా గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, డెయిరీ ఉత్పత్తులు, కొద్దిగా రెడ్ మీట్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈఏటీ-వ్యక్తిగత ప్రాధాన్యతలు, సాంస్కృతిక వైవిద్ద్యానికి అవకాశం అంశంపై లాన్సెట్ కమిషన్ ఈ వివరాలను వెల్లడించింది. ఇటువంటి ఆహారాన్ని తినడం వల్ల గుండె పోటు, టైప్ 2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఇతర సాంక్రమికేతర రోగాల ముప్పు తగ్గుతుందని, ప్రపంచంలో గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో మూడింట ఒక వంతుకు కారణం అంతర్జాతీయ ఆహార విధానాలే కారణమని నివేదిక తెలిపింది. ఆహారాన్ని ఉత్పత్తి చేయడం కారణంగా అడవుల నిర్మూలన, ఆవాసయోగ్యమైన స్థలం నష్టపోవడం, నీరు కలుషితమవడం జరుగుతున్నాయి.
ఆహార విధానాలు మార్చుకోవాలి
ఈఏటీ లాన్సెట్ కమిషన్ సహాధ్యక్షుడు ప్రొఫెసర్ జోహాన్ రాక్స్ట్రోమ్ మాట్లాడుతూ, మన పళ్లెంలో ఉన్న పదార్థాలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలవని, బిలియన్ల టన్నుల ఉద్గారాలను తగ్గిస్తాయని, జీవ వైవిధ్యం నష్టాన్ని ఆపగలవని, మంచి ఆహార వ్యవస్థను సృష్టించగలవని తెలిపారు. ఆహార విధానాలను మార్చుకోవడం సాధ్యమవుతుందని, సురక్షితమైన, న్యాయమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందరికీ అందించాలంటే, ఇది తప్పనిసరి అని తెలిపారు.
ప్రభుత్వ విధానాల్లో మార్పులు తేవాలి
ప్రొఫెసర్ వాల్టర్ విల్లెట్ మాట్లాడుతూ, ఇటువంటి ఆహారం రుచికరంగా, ఆరోగ్యకరంగా, కోరుకోగలిగినదిగా ఉంటుందన్నారు. వైవిధ్యానికి, వ్యక్తిగత ప్రాధాన్యతలకు కూడా అవకాశం ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వాలు విధానాల్లో మార్పులు తేవాలని ఈ నివేదిక కోరింది. అనారోగ్యకరమైన ఆహారంపై హెచ్చరికల లేబుళ్లను అతికించాలని తెలిపింది. ఆహారం వృథా కావడాన్ని తగ్గించాలని, సుస్థిరమైన సాగు విధానాలకు మద్దతివ్వాలని పేర్కొంది.