న్యూఢిల్లీ: జేఎంఎం ఎంపీలకు లంచం కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ బెంచ్‌కు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం వహిస్తారు. బెంచ్ అక్టోబర్ 4న విచారణ చేపట్టనున్నది.
పార్లమెంట్ లేదా రాష్ర్టాల అసెంబ్లీల్లో ఏ పక్షానికైనా అనుకూలంగా ఓటేసేందుకు లేదా మాట్లాడేందుకు లంచం తీసుకొన్న కేసుల్లో విచారణ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు 1998లో తీర్పునిచ్చింది. 1993లో ‘ఓటుకు ముడుపులు’ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసేందుకు జేఎంఎం ఎంపీలకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి.