416 votes rejected | కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి శశి ధరూర్‌పై 6,825 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 9,385 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. ఖర్గేకు 7897 ఓట్లు పోలవగా.. థరూర్ 1072 ఓట్లు పొందారు. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు చెల్లకుండా పోయాయంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనకున్న కారణాలను కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఇంఛార్జీ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ ముఖాముఖి తలపడ్డారు. ఇద్దరూ అన్ని రాష్ట్రాల పీసీసీలతో సంప్రదించి తమకు ఓటేయాలని వేడుకున్నారు. అయినా, ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీకి ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికలో చెల్లకుండా పోయిన 416 ఓట్లలో దాదాపు 80 శాతం రాహుల్‌గాంధీకి పోలయ్యాయి. అదేంటి రాహుల్ బరిలో లేరని అనుకుంటున్నారా? నిజమే రాహుల్ బరిలో లేనప్పటికీ.. చాలా మంది బ్యాలెట్ పేపర్‌పై రాహుల్ పేరు రాసి పెట్టెలో వేశారు. మరికొందరేమో బ్యాలెట్ పేపర్‌పై తమ పేరు, మొబైల్ నంబర్లను కూడా అచ్చుగుద్దారు. దాంతో ఈ బ్యాలెట్లను చెల్లనివిగా ప్రకటించినట్లు మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. ఈ విధంగానైనా రాహుల్ గాంధీకి పార్టీలో ఇంకా క్రేజ్ ఉన్నదన్న విషయం బయటపడిందని పలువురు రాహుల్ అభిమానులు సంతోషపడుతున్నారు.