PM Modi: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి 20 ఏండ్లు పట్టేదని మోదీ ఎద్దేవా చేశారు. ఇవాళ అరుణాచల్‌ప్రదేశ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.
దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలతో మన వాణిజ్య, పర్యాటక తదితర సంబంధాలకు ఈశాన్య భారత దేశం బలమైన లింకుగా మారబోతున్నదని ప్రధాని చెప్పారు. ఇవాళ ఇక్కడ రూ.55,600 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిందని అన్నారు.
ఒకసారి అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తే ఒకాయనకు మోదీ గ్యారంటీ అంటే ఏమిటో స్పష్టంగా అర్థమవుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. మోదీ గ్యారంటీ ఎలా పని చేస్తున్నదో యావత్ ఈశాన్య భారతదేశం చూస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. మేం దేశం అభివృద్ధి కోసం పనిచేస్తుంటే ప్రతిపక్ష కూటమి మాపై దాడులు చేస్తోందని ప్రధాని విమర్శించారు.